: ఏడ్చాను, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నా: రాధేమా
పలు కేసుల్లో ఇరుక్కున్న వివాదాస్పడ గాడ్ ఉమన్ సుఖ్వీందర్ కౌర్ అలియాస్ రాధే గురూమా మరోసారి మీడియా ముందుకు వచ్చింది. తనపై తప్పుడు కేసులు పెట్టారని, పోలీసులు సమన్లు జారీ చేసిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని భావించానని 'మిడ్ డే' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. "పోలీసులు విచారణకు పిలిచారని విని షాక్ కు గురయ్యాను. నేను ఏం పాపం చేశానని వివాదాల్లోకి లాగుతున్నారు? ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా. కానీ అది తప్పన్న ఆలోచనే నన్ను ఆపింది. పరిస్థితులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా" అని తెలిపింది. టీవీ నటి డాలీ బింద్రా తనను ఎంతో వేధించిందని చెబుతూ, కన్నీరు కారుస్తూ, "డాలీ బింద్రా చర్యలతో ఎంతో మనస్తాపానికి గురయ్యాను. ఆమెను మంచిగా మార్చాలని ఎంతో ప్రయత్నించా. ఆమె నా కార్యక్రమాల్లో పాల్గొంటూ, తప్పుడు మాటలు మాట్లాడేది. ఆమె హింస భరించలేక ఒకరోజు ఏడ్చాను కూడా. నా భక్తులు నిత్యమూ ఆమెను చూడాలని కోరుకునేది. తను మరో 'రాధేమా' కావాలన్నదే ఆమె ఆలోచన. అది కుదరక నాపై తప్పుడు ప్రచారం చేసింది" అని వివరించింది. తాను సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు ఆరోపించిన ఆర్షి ఖాన్ ఎవరో తెలియదని, అటువంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయలేదని, చీప్ పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం మొదలు పెట్టారని, వీరిని మంచి దారిలో పెట్టాలని భగవంతుడిని కోరుతున్నానని అంది. పార్వతీ దేవి తనతో ఉన్నట్టు భావిస్తుండబట్టే తాను త్రిశూలాన్ని చేతిలో ధరిస్తానని చెప్పింది.