: కృష్ణమ్మకు భారీ వరద... మధ్యాహ్నానికి మరింత!
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉదయం సుంకేసుల జలాశయానికి వస్తున్న వరదనీరు పెరగడంతో 9 గేట్లను ఒక మీటరు మేరకు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి అదనంగా కర్నూలు జిల్లాలో వర్షాలకు, వాగులు, వంకల్లోని నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మధ్యాహ్నానికి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం డ్యామ్ ఎత్తు 885 అడుగులు కాగా, ప్రస్తుతం 841 అడుగుల మేరకు నీరు చేరింది. ఈ వరద మూడు, నాలుగు రోజులు కొనసాగితే, డ్యామ్ పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతుంది.