: ఒబామా, పుతిన్... చేతులు మాత్రమే, మాటలు కలవలేదు!


సిరియాలో ఐఎస్ఐఎస్ మారణకాండ, మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న సంక్షోభం తదితర విషయాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు ఏకతాటిపై నిలవడంలో విఫలమయ్యారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎదురుపడ్డ ఈ ఇద్దరు నేతలూ, తమ ప్రసంగాల్లో మాటల తూటాలు వదిలారు. సిరియాపై పుతిన్ వైఖరిని ఒబామా ఎండగట్టగా, పుతిన్ సైతం అమెరికా విధానాలను తప్పుబట్టారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పుతిన్, సిరియాలో అధ్యక్షుడు బషర్ అసాద్ కు మద్దతివ్వాలని, ఐఎస్ఐఎస్ తదితర విప్లవ సంఘాలు మరింతగా పెరగకుండా చూడాల్సి వుందని కోరారు. రాజకీయ పరిష్కారం దిశగా సిరియా సాగితే, అధ్యక్షుడు తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న అమెరికాకు, ఆయనకు సహాయం చేయాలన్న పుతిన్ వైఖరి మింగుడు పడలేదు. దీంతో "ప్రస్తుత పరిస్థితి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది" అని ఆయన కాస్తంత కటువుగానే అన్నారు. ఈ ఇద్దరు నేతలు కరచాలనం చేసుకునే సమయంలో వారి కళ్లు పలకరించుకున్న తీరు వీరి మధ్య విభేదాలను మరోసారి ప్రపంచానికి తెలిపింది. ఒకరిని ఒకరు స్నేహితుల్లా భావించి ఆప్యాయంగా చూసుకోలేదని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇరు నేతల ప్రసంగాలు, ఆపై రిసెప్షన్, అనంతరం సమావేశం జరిగినప్పటికీ, వీరి మధ్య సిరియా, దాని అధ్యక్షుడు అసద్ భవిష్యత్ పై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ సమావేశాల అనంతరం, తమ మధ్య చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని మాత్రం చెప్పేసి ఒబామా, పుతిన్ లు వెళ్లిపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News