: హైదరాబాదులో మరో స్ట్రీట్ ఫైట్... బంజారాహిల్స్ హుక్కా సెంటర్ లో ఘటన


ఇటీవల హైదరాబాదు పాతబస్తీలో ఇద్దరు కుర్రాళ్ల మధ్య చోటుచేసుకున్న స్ట్రీట్ ఫైట్ సంచలనం రేపింది. ఈ స్ట్రీట్ ఫైట్ లో ఓ కుర్రాడు స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. తాజాగా నగరంలో మరో స్ట్రీట్ ఫైట్ వెలుగు చూసింది. అది కూడా సంపన్నుల ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన బంజారాహిల్స్ లో. పాతబస్తీలో ఒక్కొక్కరు కలబడితే, బంజారాహిల్స్ లో అటు వైపు పాతిక మంది... ఇటువైపు మరో పాతిక మంది ఎదురెదురుగా తలపడ్డారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమయానికి అటుగా వచ్చిన గణేశ్ శోభాయాత్ర వెంట వున్న పోలీసులు ఈ ఫైట్ ను నిలిపేశారు. అప్పటికే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల రాక ఏమాత్రం ఆలస్యమైనా ఇక్కడ కూడా పెను నష్టం సంభవించేదే. వివరాల్లోకెళితే... బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఏర్పాటైన స్కై పార్క్ హుక్కా సెంటర్ కు మొన్న ఆనంద్ నగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి సాద్ జాబ్రి తన స్నేహితులతో కలిసి వచ్చాడు. హుక్కా పీలుస్తూ, మద్యం సేవిస్తూ తన స్నేహితులతో అతడు వాటర్ బాటిళ్లు విసురుకుంటూ బెట్టింగ్ మొదలెట్టాడు. ఈ క్రమంలో వారిని హుక్కా సెంటర్ యజమాని ముక్రం వారించాడు. ఈ క్రమంలో జాబ్రి, ముక్రం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగప్రవేశం చేసిన బౌన్సర్లు వారిని బయటకు పంపేశారు. బయట కూడా రెండు గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో జాబ్రికి గాయం కాగా, అతడి స్నేహితుడు నవనీత్ సింగ్ మరింత దూసుకువచ్చాడు. ఈ ఫైట్ లో అతడూ గాయపడ్డాడు. అదే సమయంలో గణేశ్ శోభాయాత్ర వెంట వచ్చిన పోలీసులు రెండు గ్రూపులను చెదరగొట్టి గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హుక్కా సెంటర్ యజమాని ముక్రంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News