: ఎడ్ల బండిపై ఎర్రబెల్లి...టీ అసెంబ్లీ సమావేశాలకు వినూత్న నిరసనతో వెళ్లిన టీ టీడీపీ
టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సహా, ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎడ్ల బండ్లు ఎక్కారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి వాడీవేడీగా సాగనున్నాయి. రాష్ట్రంలో రైతుల ధీన స్థితిపై సర్కారు తీరును నిరసిస్తూ ఎర్రబెల్లి ఎడ్ల బండిపై అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎడ్ల బండి ఎక్కి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే అసెంబ్లీకి అల్లంత దూరంలోనే ఎర్రబెల్లి ఎడ్ల బండిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ లోపలికి ఎడ్ల బండ్లకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు, కార్లో వెళ్లాలని ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేశారు. అయితే అసెంబ్లీ ఆవరణలోకి ఎడ్ల బండ్ల ప్రవేశంపై నిషేధం ఎక్కడుందో చూపాలంటూ ఎర్రబెల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడి కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.