: ఫైండింగ్ అదితి... విశాఖ చిన్నారి కోసం ఫేస్ బుక్ లో పేజీ ఓపెన్!
ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నీటిలో కొట్టుకుపోయిన విశాఖ చిన్నారి అదితి కోసం గాలింపు చర్యలు వరసగా ఐదో రోజూ కొనసాగుతున్నాయి. కారు ఎక్కుతున్న క్రమంలో పట్టు తప్పి కాలువలో పడి కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులతో పాటు నావికాదళ సిబ్బంది నాలుగు రోజులుగా కొనసాగిస్తున్న గాలింపులో బాలికకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. అంతేకాక బాలికకు చెందిన దుస్తులు, చెప్పులు, స్కూల్ బ్యాగు కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో తన కూతురు బతికే ఉంటుందని అదితి తండ్రి చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ‘ఫైండింగ్ అదితి’ పేరిట ఫేస్ బుక్ లో ప్రత్యేక పేజీని తెరిచారు. తన కూతురు ఆచూకీ తెలిసిన వారు ఫేస్ బుక్ ద్వారా సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిసిన వారు +91 9652255533, +91 8498870308 మొబైల్ నెంబర్లకు కూడా ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. తన కూతురు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం కూడా అందజేస్తానని ఆయన ప్రకటించారు.