: తెలంగాణ అసెంబ్లీ లో నేడు కీలక చర్చ... రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేటి నుంచి అసలు సిసలు చర్చకు తెర లేవనుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్న రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి సమావేశాల్లో భాగంగా ప్రత్యేక ప్రకటన చేయనున్నారు. ఈ విషయంపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలు చేస్తున్న సన్నాహాలను గమనించిన కేసీఆర్, తానే ముందుగా ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నేడు సాంతం రైతు ఆత్మహత్యలపైనే చర్చకు సర్కారు పచ్చజెండా ఊపింది. అంతేకాక ఈ విషయంపై చర్చకు ఎలాంటి ఆటంకం రాకూడదన్న భావనతో నేటి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కూడా రద్దు కానున్నాయి. ఈ నెల 23నే సమావేశాలు అధికారికంగా ప్రారంభమైనా, తొలి రోజు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిలకు సంతాపం ప్రకటించిన సభ, నేటికి వాయిదా పడింది.