: భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు... బ్రిటన్, ఫ్రాన్స్ కూడా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం సుదీర్ఘ కాలంగా భారత్ చేస్తున్న యత్నాలకు అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు మద్దతు పలికింది. భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్ లు కూడా భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికాయి. ఈ మేరకు నిన్న ఆ దేశాలు భారత్ కు మద్దతు తెలుపుతూ విస్పష్టంగా ప్రకటించాయి. ఈ మూడు దేశాల నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. ఇప్పటిదాకా భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై మద్దతు విషయంలో అమెరికా దాటవేత ధోరణితో వ్యవహరించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఏడాది వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మూడు పర్యాయాలు భేటీ కాగలిగారు. ఈ క్రమంలోనే భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై ఆ దేశం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.