: ఎన్టీఆర్ ఫస్టు.. చిరంజీవికి నెక్స్టు
తెలుగు సినీ ఖ్యాతిని యావత్ భారతావనికి సగర్వంగా చాటిన నటుల్లో నందమూరి తారక రామారావుది అగ్రస్థానం. పౌరాణిక, జానపద, సాంఘిక.. పాత్ర ఏదైనా సాధికారత ప్రదర్శించడం ఆయనకే చెల్లింది. నిశితమైన హావభావాలు, సమ్మోహితుల్ని చేసే అభినయం, కట్టిపడేసే వాచికం ఆయన సొంతం. ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను ఆ స్థాయిలో ఏలిన కథానాయకుడు చిరంజీవి.
ఆల్ రౌండర్ కు పర్యాయపదంలా ఈ తొలి తెలుగు మెగాస్టార్ ను పేర్కొనవచ్చు. సాత్వికత, కరుణ, రౌద్రం, హాస్యం.. ఇలా రసం ఏదైనా అలవోకగా పలికించడం చిరుకు స్టెప్పులేసినంత ఈజీ. ఒకవిధంగా ఈ కష్టజీవిని ఇంతమంది అభిమానానికి పాత్రుణ్ణి చేసింది మాత్రం ఆయన నృత్యాలే. తెలుగు సినీ డాన్సులకు కొత్త ఒరవడి దిద్దిన ఘనత చిరంజీవిది. ఇదీ టూకీగా తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలుగా పేర్కొనదగ్గ ఎన్టీఆర్, చిరంజీవిల గురించి.
ఇప్పుడు వీరిద్దరికీ ఎన్డీటీవీ.. టాప్-20 దిగ్గజ నటుల జాబితాలో చోటు కల్పించింది. భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దేశంలో ప్రభావవంతులైన నటులతో ఎన్డీటీవీ ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ కు 6వ స్థానం, చిరంజీవికి 15వ స్థానం లభించాయి. ఈ దిగ్గజాల లిస్టులో అగ్రస్థానం బాలీవుడ్ అలనాటి హీరో దిలీప్ కుమార్ కు దక్కింది. కాగా, బిగ్ బి అమితాబ్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు.