: తల్లి ప్రసవానికి కొడుకే వైద్యుడు!
తల్లి నిండు గర్భిణి. వైద్యులు చెప్పిన తేదీ కన్నా ముందే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో పదకొండేళ్ల తన కొడుకు తప్ప ఇంట్లో మరెవ్వరూ లేరు. తల్లి పరిస్థితిని చూసి ఆ కొడుకు వెంటనే స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే, అమెరికాలోని జార్జియాలో ఉన్న మరియెట్టా ప్రాంతానికి చెందిన కెన్యార్డా నిండు గర్భిణీ. కొడుకు జేమ్స్ డ్యూక్స్. ఆమె నొప్పులు పడుతున్న సమయంలో అక్కడే ఉన్న జేమ్స్ ఏమాత్రం కంగారు పడలేదు. వెంటనే అత్యవసర విభాగం 911కి ఫోన్ చేశాడు. ఎమర్జెన్సీ ఆపరేటర్ సూచించిన ప్రకారం చేయాల్సిన పనులు వెంటనే చేశాడు. తల్లి ప్రసవానికి సహకరించాడు. అప్పుడే పుట్టిన తన తమ్ముడిని శుభ్రం చేసి, బిడ్డ సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. వైద్య బృందం అక్కడికి వచ్చే వరకు తన తల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకున్నాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పొరుగువారు జేమ్స్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక జేమ్స్ తల్లి కెన్యార్డా గురించి చెప్పేదేముంది.. ‘నా బిడ్డే, నా పాలిట వైద్యుడు’ అని కెన్యార్డా సంతోష పడింది.