: కాశ్మీరీ పండిట్ కి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు... వెల్లివిరిసిన మతసామరస్యం
వైభంగ్... కాశ్మీర్ లోని భారత్-పాక్ సరిహద్దు గ్రామం. బోర్డర్ లోని పుల్వామాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో 1000 ముస్లిం కుటుంబాలు ఉండగా, 8 కాశ్మీరీ పండిట్ కుటుంబాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్ లు ఉండకూడదని ఉగ్రవాదులు హెచ్చరించినప్పటికీ, వారంతా అక్కడే బతుకుతున్నారు. ఈ క్రమంలో, రామ్ జీ కౌల్ (78) అనే ఓ కాశ్మీరీ పండిట్ గత శుక్రవారం మృతి చెందారు. ఇది తెలుసుకున్న గ్రామంలోని ముస్లింలంతా అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని చూసి భోరున విలపించారు. అంతేకాదు, రామ్ జీ అంత్యక్రియలను కూడా దగ్గరుండి నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రామ్ జీ బంధువులకు కూడా తమ ఇళ్లలోనే ఆశ్రయం కల్పించారు. హిందూ-ముస్లింల మధ్య స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు, ఐక్యతకు ఈ ఘటన అద్దం పట్టింది. ఈ ఘటనతో అక్కడ మతసామరస్యం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా, స్థానిక ముస్లింలు మాట్లాడుతూ, రామ్ జీ తమ కుటుంబాలకు పెద్ద దిక్కు వంటి వారని చెప్పారు. ఆయన ఏది చెబితే, అదే తమకు వేద వాక్కు అని తెలిపారు. తమకు మతంతో సంబంధం లేదని, పొరుగు వారికి సహాయం చేయడమే తమ కర్తవ్యమని అన్నారు.