: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే...గుండె పదిలం!
నిత్యం చేసే వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే చాలు గుండె జబ్బులు మన దరికి చేరకుండా ఉండవచ్చనుకుంటాము. అయితే, ఇవొక్కటే కాదని, వీటికి తోడుగా ఇంకొన్ని అలవాట్లు తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. గుండెకు హానిచేసే ఏడు అలవాట్లకు మనం దూరంగా ఉండాలని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాట్లు ఏమిటంటే... అధికంగా కూర్చోవడం : రోజు మొత్తంలో ఎక్కువ సమయం కూర్చుని వుండడం అంటే... టీవీల ముందు, వాహనాలు నడుపుతూ ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండెకు హాని కలుగుతుంది. రోజు మొత్తంలో 5 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చోవడం కారణంగా మనుషుల్లో గుండె జబ్బులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీనికి చెక్ పెట్టాలంటే ప్రతి రెండు గంటలకూ ఐదు నిమిషాల పాటు నడిస్తే చాలు. తద్వారా శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగడం : బాగా కష్టపడ్డాం కదా అని చెప్పి పీకల దాకా తాగితే.. ఆక్సీకరణ చేయడానికి, రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కూడా చాలా ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది. దీంతో గుండె సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు తొందరగా కోపం తెచ్చుకునే తత్వం, అతితక్కువగా నిద్రపోవడం, దంతాలు, చిగుళ్ల సంరక్షణపై శ్రద్ధ లేకపోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వంటి మొదలైన అలవాట్లకు మనం దూరంగా ఉంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.