: కొండా లక్ష్మణ్ బాపూజీపై పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తాం: దత్తాత్రేయ
తెలంగాణ కోసం తపించి, నిర్విరామంగా ఉద్యమించిన కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బాపూజీ చిత్రంతో త్వరలోనే ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో బాపూజీ శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ... కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాపూజీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు.