: మేం చెప్పేది నిజమండీ బాబూ... రాహుల్ పర్యటన ఫొటోలను విడుదల చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉన్నట్టుండి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. కీలక రాష్ట్రం బీహార్ లో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ ఉన్నట్టుండి మాయమయ్యారు. దీనిపై ఆ పార్టీ నేతలకే సమాచారం లేకపోయింది. దీంతోనే రాహుల్ గాంధీ లండన్ కు వెళ్లారని తొలుత ప్రకటించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా, ఆ తర్వాత అమెరికా వెళ్లారని ప్రకటించారు. అయితే అమెరికా నగరం ఆస్పెన్ లో ఎప్పుడో ముగిసిన అంతర్జాతీయ సదస్సుకు రాహుల్ గాంధీ ఇప్పుడు వెళ్లడమేమిటని బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై నిన్నటిదాకా నోరు మెదపని కాంగ్రెస్ నేటి ఉదయం ఓ ఫొటోను విడుదల చేసింది. ఆస్పెన్ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారంటూ, అదే ఈ ఫొటో అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఫొటోలో సదస్సులో కూర్చున్న రాహుల్ ఫొటో అయితే ఉంది కాని, ఆ సదస్సు ఎప్పుడు, ఎక్కడ జరిగిందోనన్న వివరాలు మాత్రం లేవు.