: స్టీరింగ్ వదిలి పారిపోయారు... రాహుల్ అమెరికా పర్యటనపై ‘పాంచజన్య’ వ్యంగ్యాస్త్రం
దేశంలో కీలక రాష్ట్రం బీహార్ లో హోరాహోరీ ఎన్నికలకు తెరలేచింది. అటు బీజేపీనే కాక ఇటు కాంగ్రెస్ కూటమి కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు చెక్కేశారు. రాహుల్ పర్యటనపై ఆయన సొంత పార్టీ నేతలే కేవలం గంటల వ్యవధిలోనే రెండు రకాల ప్రకటనలు చేశారు. తొలుత రాహుల్ లండన్ వెళ్లారన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి, వెనువెంటనే అమెరికా వెళ్లారని మాట మార్చారు. ఇక రాహుల్ పర్యటనపై స్పందించిన బీజేపీ, ఓటమి బాధ నుంచి తప్పించుకునేందుకు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన పేరిట యుద్ధ క్షేత్రాన్ని వదిలి పరారయ్యారని ఆరోపించింది. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వంతు వచ్చింది. తన అధికారిక పత్రిక ‘పాంచజన్య’లో రాహుల్ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘‘దేశంలో వృద్ధ పార్టీకి చెందిన యంగ్ మిస్టర్ ఇండియా రాహుల్ గాంధీ... నౌక స్టీరింగ్ ను వృద్ధ నేతలపైనే వదిలేసి వెళ్లిపోయారు’’ అని ఆ పత్రిక నిన్నటి తన సంచికలో రాసింది.