: అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారం
1969 ఉద్యమంలో చనిపోయిన నలుగురు అమరవీరుల కుటుంబాలకు, 2001 ఉద్యమంలో చనిపోయిన ఓ అమరుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందజేసింది. మొత్తం ఐదు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నాయిని సచివాలయంలో మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక రేపటి వినాయక నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ లో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా నగరంలోని దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.