: అదొక సెలబ్రిటీ మేక...10 లక్షలిచ్చినా అమ్మనంటున్న యజమాని!
బక్రీద్ వస్తోందంటే చాలు, ప్రేమగా పెంచిన మేకల్ని వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటారు చాలామంది. కానీ, ఓ పేద ముస్లిం మాత్రం తన మేకను 10 లక్షలు ఇచ్చినా అమ్మనని తెగేసి చెబుతున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని కోబ్రా జిల్లాకు చెందిన అబ్దుల్ రజాక్ అలీ అనే రోజు కూలీ దగ్గర ఎరుపు, తెలుపు రంగుల్లో వుండే ఓ మేక ఉంది. ఓ రోజు దానిని మేపుతుండగా, దాని ఒంటిపై ఉన్న మచ్చలు అల్లా అనే ఉర్దూ అక్షరాలను పోలి ఉండడాన్ని అలీ తొమ్మిదేళ్ల కుమారుడు గుర్తించాడు. వెంటనే తన తండ్రి, స్నేహితులకు ఆ విషయాన్ని చెప్పాడు. ఈ వార్త చుట్టుపక్కల తెలియడంతో ఓ వ్యక్తి దాని ఫోటో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఆ మేక సెలబ్రిటీ అయిపోయింది. దానిని చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ మేకను రజాక్ అలీ 9,600 రూపాయలకు కొనుగోలు చేయగా, దాని గురించి తెలుసుకున్న పలువురు 'పది లక్షలిస్తాం మాకివ్వండి' అని అడుగుతున్నారట. అయితే, రజాక్ మాత్రం వారి ఆఫర్లను తిరస్కరిస్తున్నాడు. ఎన్ని లక్షలిచ్చినా ఇచ్చేది లేదంటున్నాడు!