: బెజవాడలో నారా లోకేశ్ కు గెస్ట్ హౌస్...చంద్రబాబు నివాసానికి అతి సమీపంలోనేనట!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు కూడా నవ్యాంధ్ర నూతన రాజధాని సమీపంలో ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ తయారవుతోంది. ఇప్పటికే కృష్ణా కరకట్టలపై అధునాతన హంగులతో నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు తాత్కాలిక నివాసంగా మారింది. విజయవాడలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఈ భవనంలోనే ఉంటున్నారు. ఇదే భవనంలో లోకేశ్ కూడా ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది లేదట. అయితే ఆయనను కలిసేందుకు వస్తున్న పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తాను వేరే గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసుకుంటేనే మంచిదని లోకేశ్ భావించారు. లోకేశ్ వినతితో అధికారులు లింగమనేని గెస్ట్ హౌస్ కు సమీపంలోనే మరో అధునాతన భవంతిని గుర్తించారు. ఈ భవనానికి లింగమనేని గెస్ట్ హౌస్ మీదుగా కాకుండా ఉండవల్లి గుహాలయాల నుంచి వేరే మార్గం కూడా ఉందట. చంద్రబాబు సెక్యూరిటీ, ఇతర అధికారులు ఈ భవనాన్ని నిన్న రాత్రి పరిశీలించారు. త్వరలోనే లోకేశ్ ఈ భవనాన్ని తన గెస్ట్ హౌస్ గా మార్చుకోబోతున్నారు.

  • Loading...

More Telugu News