: బెల్టు షాపుపైకి దండెత్తిన మహిళలు... గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి ఘటన
నవ్యాంధ్ర రాజధానికి కేంద్రంగా మారనున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ గ్రామంలో అర్ధరాత్రి మహిళలు ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. గ్రామంలో మద్యం విక్రయాలు సాగిస్తున్న బెల్టు షాపుపై మూకుమ్మడిగా దాడి చేశారు. బెల్టు షాపులోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడమే కాక పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ దుకాణం మూతపడేలా చేశారు. వివరాల్లోకెళితే... గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరేపల్లిలో గడచిన నాలుగేళ్లుగా బెల్టు షాపు నడుస్తోంది. మద్యానికి బానిసలైన పలువురు వ్యక్తులు కూలీ డబ్బులను బెల్టు షాపు వద్దే తగలేస్తూ కుటుంబాలను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ షాపును మూసేయాలని గ్రామానికి చెందిన పలువురు మహిళలు అధికారులకు లెక్కలేనన్ని సార్లు ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదు. నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా బెల్టు షాపు వద్ద మద్యం తాగిన కొందరు వ్యక్తులు గ్రామానికి చెందిన కొందరు మహిళలను వేధింపులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ మహిళలంతా కలిసి బెల్టు షాపుపై మూకుమ్మడి దాడి చేశారు. వీరి నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు షాపును మూసేయించారు.