: రాజధాని అంటే పది ఆఫీసులు కట్టుకోవడం కాదు కదా?: చంద్రబాబు
విజయవాడ రాజధానిగా పది ఆఫీసులు కట్టుకుంటే సరిపోతుందని తాను భావించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో సీఆర్డీయేపై సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని అంటే పది ఆఫీసులు మాత్రమే కాదని, ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉండాలని భావించానని అన్నారు. అందుకోసమే తనకున్న పరిచయాలతో సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించానని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం గురించి తన ఆలోచనలు చెప్పగానే, సింగపూర్ ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసి, అనుకున్న సమయం కంటే ముందుగానే రాజధాని ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం అంటే మల్టీనేషనల్ కంపెనీలు, పరిశ్రమలు, ఆర్థిక జోన్లు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రజావసరాలు తీర్చే సౌకర్యాలు ఉండాలని ఆయన అన్నారు. తనపై నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారని, అదే నమ్మకంతో అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని ఆయన తెలిపారు. అందుకు ప్రతిగా సింగపూర్ కు దీటైన మహానగరాన్ని రాజధానిగా నిర్మించాలని భావించానని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన ప్రణాళికలు, అత్యున్నతమైన దార్శనికత ఉండాలని ఆయన తెలిపారు. అలాంటి కంపెనీలకే బాధ్యతలు అప్పగిస్తామని ఆయన చెప్పారు. చైనాలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే 60 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని రాకుండా ఉండేందుకు చాలా మంది కుట్రలు చేశారని, అలాంటి వారంతా కుళ్లుకునేలా రాజధానిని నిర్మిస్తామని ఆయన తెలిపారు.