: ప్రపంచాన్ని బాగుచేయాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉంది: పోప్ ఫ్రాన్సిస్
ప్రపంచంలోని ప్రజల కష్టాలను తీర్చాలని అమెరికాకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు. అగ్రరాజ్యం కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశంలో పోప్ ప్రసంగించారు. ఈ ఘనత సాధించిన తొలి పోప్ ఆయనే. వలసదారుల గతాన్ని తవ్వితీసి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నవారిని నిరాదరించవద్దని చెప్పారు. స్వయంగా తానొక శరణార్ధి కొడుకునని, అలాంటి వారి కష్టాలు ఎలా ఉంటాయో తనకు అనుభవపూర్వకంగా తెలుసునని పోప్ వెల్లడించారు. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా మిగిలిన అమెరికా తన శక్తి సామర్థ్యాలను ప్రజల గాయాలు మాన్పడానికే ఉపయోగించాలని కోరారు. ద్వేషం, నిరాశ, పేదరికం, కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రపంచాన్ని బాగుచేయాల్సిన బాధ్యత కూడా అమెరికాపై ఉందని ఫ్రాన్సిస్ ఉద్బోధించారు. రేపటివరకు న్యూయార్క్ లో ఉండే పోప్, చివరిగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు.