: పోలీసుల మధ్య కులాల 'కుంపట్లు'...అప్పుడే కాదు ఇప్పుడు కూడా!


13వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ, పృధ్వీరాజ్ చౌహాన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ. సూర్యాస్తమయం కాగానే, తన శత్రువుల సైన్యం గ్రూపులుగా విడిపోయి, ఎవరి వంటలను వారు వండుకుని తినడాన్ని తిలకించిన ఘోరీ ఆశ్చర్యపోయాడని చరిత్రలో ఉంది. వంటల విషయంలో విడివిడిగా ఉండే చౌహాన్ సైన్యం తెల్లారేసరికి ఏకతాటిపై నిలిచి భీకరంగా పోరాడుతూ ఉండేదట. దాదాపు 800 సంవత్సరాల తరువాత, ఇప్పుడు పాట్నాలోని కిలో మీటరు పొడవైన గాంధీ మైదాన్ శిక్షణా కేంద్రాల్లో పోలీసులు ఇలానే గ్రూపులుగా విడిపోయి ఎవరి వంటలు వారు చేసుకుంటున్నారు. కానిస్టేబుళ్ల నుంచి హవల్దార్ ల వరకూ, యువకుల నుంచి సీనియర్ల వరకూ, చట్టాన్ని కాపాడాల్సిన సమయంలో కలసి నిరసనకారులు, సంఘ విద్రోహులపై విరుచుకుపడే వీరు, సాయంత్రమైతే, తమ మధ్య కులాల గీతలు గీసుకుని, విడివిడిగా వంటలు వండుకుని తింటున్నారు. నిత్యమూ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఈ తరహా కులాల 'కుంపట్లు' 20కి పైగానే కనిపిస్తుంటాయి. "ఈ పరంపర సంవత్సరాలుగా సాగుతోంది. ఇప్పుడు మేం పెట్టుకున్నది కాదు. ఏ కులం వారు ఆ కులం గ్రూప్ లో చేరిపోయి ఒకటిగా వండుకుని తింటారు" అని ఓ కానిస్టేబుల్ వ్యాఖ్యానించాడు. వంటల విషయంలో వీరిని కలిపి వుంచాలని కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. విడివిడిగా వంటలు చేసుకోవడం వల్ల మనస్పర్థలు, ర్యాంకుల్లో తేడాలు రావా? అని ప్రశ్నిస్తే, అటువంటిదేమీ ఉండదన్న సమాచారం వచ్చింది. ఇక్కడి బ్యారక్ లలో సైతం ఒకే కులం వారు వుంటారు. బ్యారక్-3లో రాజ్ పుత్ లు, 5వ నంబర్ బ్యారక్ లో భూమిహార్ లు, 8వ నంబర్ బ్యారక్ లో పాశ్వానులు... ఇలా కేటాయించుకుని రాత్రయితే, తమ కులం వాళ్లతో మాత్రమే సమయాన్ని గడుపుతారట.

  • Loading...

More Telugu News