: వరంగల్ పై కన్నేసిన బీజేపీ, రంగంలోకి ఏడుగురు కేంద్రమంత్రులు!
త్వరలో జరిగే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి టీఆర్ఎస్ పార్టీకి షాకివ్వాలని భావిస్తున్న బీజేపీ, ఏడుగురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించనుంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 వరకూ వరంగల్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు జరపాలని నిర్ణయించింది. ఒక్కో అసెంబ్లీని ఒక్కో కేంద్ర మంత్రికి అప్పగించాలని, వారందరి ఆధ్వర్యంలో ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని భావిస్తోంది. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, సంతోష్ గంగ్వార్, హన్సరాజ్ గంగారాం, బండారు దత్తాత్రేయ, చౌదరీ వీరేందర్ సింగ్ లకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు వస్తున్నప్పటికీ, ఇప్పుడే పనులు ప్రారంభిస్తే, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తాయన్న ఆలోచనతో కావాలనే కేసీఆర్ సర్కారు నిధులను వాడటం లేదన్నది బీజేపీ నేతల ప్రధాన ఆరోపణ. యాదగిరిగుట్ట నుంచి హన్మకొండ వరకూ జాతీయ రహదారి కోసం రూ. 1,900 కోట్లు కేంద్రం ఇస్తే, పనులకు శంకుస్థాపన జరుగకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేసీఆర్ తీరును ఎండగట్టడానికి స్వయంగా రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు.