: కర్ణాటకలో చెట్టును ఢీకొన్న ‘ఎర్ర’ లారీ... కడప కానిస్టేబుల్ దుర్మరణం, ఎస్సైకి గాయాలు
కర్ణాటకలోని బీజాపూర్ వద్ద నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. అదే జిల్లాకు చెందిన ఎస్సై సహా లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. అయినా కడప జిల్లాకు చెందిన పోలీసులు కర్ణాటకకు వెళ్లడమేంటి, లారీలో ప్రయాణించడమేంటనే కదా మీ అనుమానం? ఇటీవల ఢిల్లీ వీధులను జల్లెడ పట్టిన కడప జిల్లా పోలీసులు ఓ అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత అతడి నుంచి రాబట్టిన సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన కడప జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను కడపకు తీసుకొచ్చే క్రమంలో నిన్న ఓ లారీలో దుంగలను ఎక్కించుకుని కర్ణాటక మీదుగా కడప బయలుదేరారు. బీజీపూర్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పిన లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై, లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి.