: దసరా నాటికి అమరావతి నుంచే ఏపీ పాలన...చంద్రబాబు ఆదేశాలతో యనమల సమీక్ష
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి నవ్యాంధ్రప్రదేశ్ పాలనను కొనసాగించడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అంతగా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేసిన ఆయన అతి స్వల్ప వ్యవధిలోనే భూసేకరణను పూర్తి చేశారు. అంతేకాదు, అక్కడ నవ్యాంధ్ర రాజధానికి ‘అమరావతి’ పేరును ఖరారు చేసిన ఆయన సింగపూర్ సంస్థలతో మాస్టర్ ప్లాన్ కూడా గీయించారు. ఇక విజయదశమి పర్వదినాన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కోసం చంద్రబాబు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. తాజాగా దసరా నాటికి అమరావతి పరిసరాల్లోని గుంటూరు, విజయవాడల నుంచే ఏపీ పాలనను సాగించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం సింగపూర్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దసరా నాటికి అమరావతి పరిసరాల నుంచే పాలన సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చూడండన్న చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికిప్పుడు పాలనను విజయవాడ, గుంటూరులకు తరలిస్తే... అవసరమయ్యే భవనాలు, వసతులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్న అంశంపై యనమల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.