: సెల్ఫీ మరణాలే ఎక్కువ!
షార్క్ చేపల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కంటే తమకు తామే ఫొటోలు తీసుకుంటూ (సెల్ఫీ) ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్యే ఎక్కువట. ఈ విషయాన్ని హప్ఫింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. తమ ఫొటో తామే తీసుకోవడం సెల్ఫీ. ఈ సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఈ ఏడాది 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో షార్క్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 మంది. జపాన్ కు చెందిన 66 సంవత్సరాల వృద్ధుడు తాజ్ మహల్ వద్ద, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వద్ద మిసిసీపీకి చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి హృదయ విదారక సంఘటనలు రష్యా దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయిట. దీంతో ఆందోళన చెందిన అక్కడి ప్రభుత్వం సేఫ్ సెల్ఫీ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ఈ క్యాంపెయిన్ లో సెల్ఫీ తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేసే ఒక బుక్ లెట్ ను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.