: రిజర్వేషన్లపై బీజేపీ సూటిగా అభిప్రాయం చెప్పాలి: నితీష్ డిమాండ్
ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై బీజేపీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థకి ఆర్ఎస్ఎస్ బద్ధ వ్యతిరేకి అని అన్నారు. బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ బాటలోనే నడుస్తుండడంతో రిజర్వేషన్లను తీసేయాలనే భావనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకి అని, అందుకే వాటిని మార్చేందుకు ఆయన బీజేపీపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. మామూలుగా రాజ్యాంగానికి పార్లమెంట్ ద్వారా సవరణలు చేస్తారని, అయితే ఆర్ఎస్ఎస్ దానికి భిన్నంగా ఎక్స్ ట్రా రాజ్యాంగాన్ని కొత్తగా తయారు చేయాలని భావిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రాజ్యాంగం చేతుల్లోనో లేక పార్లమెంటు చేతుల్లో లేకుండా ప్రత్యేక కమిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని నితీష్ అభిప్రాయపడ్డారు. అందుకే రిజర్వేషన్లపై బీజేపీ విధానం ఏంటనేది సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, 242 మంది అభ్యర్థులతో కూడిన మహాకూటమి అబ్యర్థుల జాబితాను నితీష్ విడుదల చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు అత్యధికంగా ఉండడం విశేషం.