: ఈసీ మా చేతుల్లోనే ఉందన్న బీజేపీ: అమిత్ షాను వివరణ కోరిన కమిషన్
"ఎన్నికల కమిషన్ మా చేతుల్లోనే ఉంది" అని బీజేపీ నేత జాయ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎల్లుండిలోగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన కార్మికుల సమావేశంలో జాయ్ బెనర్జీ మాట్లాడుతూ, "గతంలో మమ్మల్ని మోసం చేసి ఓడించారు. ఇప్పుడు సైన్యం రంగంలోకి దిగింది. ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉంది. విజయం మాదే" అని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈసీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ సమంజసం కాదని వ్యాఖ్యానిస్తూ, ఈ తరహా ప్రసంగాలను తాము సహించబోమని ఈసీ స్పష్టం చేసింది. కాగా, పశ్చిమ బెంగాల్ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జాయ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ను ఆ పార్టీ తన చేతుల్లో ఉంచుకుందనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని తృణమూల్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.