: పండగ సీజన్ డిస్కౌంట్లు భ్రమే!


ఈ దసరా దీపావళి సీజనులో స్మార్ట్ ఫోన్ లేదా మరో ఖరీదైన హోం అప్లయన్స్ కొనాలని భావిస్తున్నారా? ఈ సీజన్ లో ఈ-కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తాయని అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. తమపై నమ్మకం పెట్టుకుని వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఇస్తున్న కస్టమర్ల నుంచి, ఈ సీజనులో అధికంగా లాగి, తగ్గిన తమ మార్జిన్లను సరిచేసుకోవాలని ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ సంస్థలు, మేజర్ బ్రాండ్లు భావిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆఫర్లు, డిస్కౌంట్ కూపన్లతో ఊదరగొట్టిన ఈ సంస్థలు, ఈ పండగ సీజనులో మాత్రం ఆ ఆఫర్లకు దూరంగా ఉండనున్నాయి. ఇకపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేయలేమని యాపిల్, సోనీ, శాంసంగ్, పూమా, అరవింద్ తదితర బ్రాండ్లు ఈ కామర్స్ సంస్థలకు స్పష్టం చేశాయి. అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలకు ప్రముఖ బ్రాండ్లు తమ ప్రొడక్టులను డిస్కౌంట్ ధరలకు అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత ఈ-కామర్స్ చరిత్రలో వివిధ బ్రాండ్లు మార్జిన్లపై కన్నేసి, ఆఫర్లకు దూరంగా ఉండే పండగ సీజన్ ఇదే కానుంది. కాబట్టి, ఈ సీజనులో వస్తువులు కొనుగోలు చేయాలంటే, ఇప్పుడే సొంతం చేసుకోండి. దసరా, దీపావళి అనుకుంటూ ఆగితే, మీ జేబు నుంచి ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు.

  • Loading...

More Telugu News