: అబ్దుల్ కలాం ఏపీలో పుట్టాలని నాలుక కరుచుకున్న ఎర్రబెల్లి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు సభ నివాళి అర్పించింది. అనంతరం కలాం సంతాప తీర్మానంపై వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు. హైదరాబాదులోని డీఆర్డీఎల్ కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత తమ అధినేత చంద్రబాబుదే అని తెలిపారు. అబ్దుల్ కలాం మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలని అన్న ఎర్రబెల్లి... జరిగిన పొరపాటును గమనించి నవ్వుకున్నారు. దాంతో, తెలంగాణలోనే తెలుగు పౌరుడిగా పుట్టాలని సరిదిద్దుకున్నారు. ఈ సందర్భంగా సభలో నవ్వులు విరబూశాయి.