: పిచ్ పై కలబడ్డ క్రికెటర్లు
జెంటిల్ మన్ గేమ్ క్రికెట్ లో వాదులాటలకు తావు లేదు. అయితే టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ, మాజీ క్రికెటర్ శ్రీశాంత్ లతో పాటు ఆసీస్ జట్టు సభ్యులకు ఈ నిబంధనలు వర్తించవనుకోండి. ఎందుకంటే, మైదానంలో వీరున్న చోట వాదులాటలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా వాదులాటలు శృతి మించి ముష్టి యుద్ధాల వరకు వెళుతున్నాయి. క్రికెట్ పిచ్ పై ఇద్దరు క్రికెటర్లు కలబడ్డారు. బ్యాట్స్ మన్ ను ప్రత్యర్థి జట్టుకు చెందిన వికెట్ కీపర్ తలపై చేతితో కొట్టగా, చిర్రెత్తుకొచ్చిన బ్యాట్స్ మన్ తన చేతిలోని బ్యాటును పైకెత్తాడు. వెరసి ఇద్దరు పిచ్ పైనే కలబడ్డారు. కిందపడ్డారు. పొర్లాడారు. అంపైర్లు, తోటి క్రికెటర్లు వారిస్తున్నా వారు వినలేదు. ఏకంగా పోలీస్ వ్యాన్ పిచ్ వద్దకు వస్తే కాని వారు శాంతించలేదు. జెంటల్ మన్ గేమ్ కే మచ్చగా నిలుస్తున్న ఈ ఘటన బెర్ముడాలో చోటుచేసుకుంది. క్లీవ్ లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్, విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘర్షణ జరిగింది. విల్లో బ్యాట్స్ మన్ జార్జి ఓబ్రెయిన్, క్లీవ్ లాండ్ కీపర్ జాసన్ ఆండర్సన్ ల మధ్య జరిగిన మాటల యుద్ధం చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో ఓబ్రెయిన్ ను జాసన్ నెత్తిపై కొట్టగా, ఓబ్రెయిన్ తన చేతిలోని బ్యాటుతో జాసన్ ను కొట్టేందుకు యత్నించాడు. ఇద్దరూ అక్కడే ఒకరితో మరొకరు కలబడ్డారు. ఈ ఘర్షణ తర్వాత జాసన్ జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కోగా, ఓబ్రెయిన్ మాత్రం ఆరు మ్యాచ్ ల నిషేధానికి గురయ్యాడు.