: బాబు సీఎం అయ్యారు... ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు: జగన్
విశాఖ కళావాణి పోర్టు స్టేడియంలో జరిగిన యువభేరి సదస్సులో ప్రత్యేక హోదాపై విద్యార్థులతో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశామయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. హోదాపై చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రుల్లో కొంతమందికి ప్రత్యేక హోదా అంటే ఏమిటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు బాబు సహకరించారని ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని, కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో రైతు రుణాలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్న జగన్, బాబు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు తాను సీఎం అయితే ఉద్యోగం వస్తుందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని, అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చూశారు. మరిప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారుని విమర్శించారు. ఒక్క విశాఖలోనే 5వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోయాయని జగన్ చెప్పారు. అంతేగాక ఇప్పటివరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఇక డీఎస్సీ పరీక్ష రాసిన వారికీ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి నోటిఫికేషన్ విడుదలచేసి ఖాళీలను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు యూనివర్శిటీల్లో 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వర్సిటీలు దివాలా తీయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రైవేటు యూనివర్శిటీలను తీసుకురావాలన్నదే చంద్రబాబు ఆలోచన అని జగన్ చెప్పుకొచ్చారు. దాంతో ఇక విద్యార్థులకు కన్వీనర్ కోటా ఉండదని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు.