: ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే వడ్డీ తగ్గించాల్సిందే: ఆర్బీఐపై జైట్లీ చురకలు
మరికొద్ది రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే, ఇండియాలో వడ్డీ రేట్లు తప్పనిసరిగా తగ్గాల్సిందేనని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో ఉన్నందున, అభివృద్ధి దిశగా సాగేలా నిర్ణయాలు ఉండాలని ఆయన చురకలు వేశారు. ఈ మేరకు ఆర్బీఐ సరైన నిర్ణయాలు తీసుకోవాలని, అంతకన్నా ముందు పారిశ్రామిక వర్గాల వినతులను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వడ్డీ రేట్లు తగ్గితే, స్థూల జాతీయోత్పత్తి రేటు ఊహించిన 7 నుంచి 7.5 శాతం కన్నా వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 29న ద్వైమాసిక పరపతి సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత రెపో రేటు కనీసం 0.25 నుంచి 0.5 శాతం వరకూ తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.