: ఐఎస్ఐఎస్ లో చేరాలనుకున్న హిందూ యువతి
కిరాతక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో కలిసేందుకు మన దేశంలోని కొందరు ఉత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే, హిందూ మతానికి చెందిన ఓ యువతి ఇస్లామిక్ స్టేట్ లో చేరడానికి యత్నించింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె తండ్రి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ని సంప్రదించారు. ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్లతో సంప్రదిస్తున్న విషయాన్ని గమనించిన ఆయన... తన కూతురు కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎన్ఐఏ అధికారులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన ఎన్ఐఏ... ఆమె సిరియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని గ్రహించి, ఆమె ప్రయత్నాన్ని విఫలం చేశారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. ఆ దేశంలో ఐఎస్ కు సహకరిస్తున్న వారి ప్రభావం ఆమె మీద పడింది. వారి వల్లే ఆమె ఐఎస్ లో చేరాలనుకుంది. అయితే, ఎన్ఐఏ అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, ఇస్లామిక్ స్టేట్ లో చేరాలన్న తన ఆలోచనను ఆమె విరమించుకుంది.