: ‘మేక్ ఇన్ ఇండియా’ తొలి ఫలం ఏపీకే... ప్రకాశం జిల్లాలో ‘నిమ్జ్’ ఏర్పాటుకు రంగం సిద్ధం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ తొలి ఫలం నవ్యాంధ్రకే దక్కనుంది. దేశ పారిశ్రామిక ప్రగతికి ఊపిరిలూదేందుకు దేశవ్యాప్తంగా 12 చోట్ల ‘నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మాన్యూఫ్యాక్చరింగ్ జోన్’(నిమ్జ్)లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు 50 చదరపు కిలో మీటర్ల పరిధిలోని భూమిని చూపిస్తే, వెనువెంటనే ‘నిమ్జ్’ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని కేంద్రం ఆ ప్రతిపాదనల్లో రాష్ట్రాలకు తెలిపింది. ఒకేసారి 50 చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న భూమి లభించాలంటే సాధ్యం కాదన్న భావనతో ఇటీవల ఆ విస్తీర్ణాన్ని 10 చదరపు కిలో మీటర్లకు కుదించింది. దీంతో ఏపీ సర్కారు వెనువెంటనే స్పందించింది. 10 చదరపు కిలో మీటర్ల వైశాల్యమున్న భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి లేఖ రాసింది. ఇందుకోసం ప్రకాశం జిల్లాలోని స్థలాన్ని చూపింది. దీనిని పరిశీలించి ఓకే చేసిన కేంద్రం నిమ్జ్ ఏర్పాటుకు కార్యరంగాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రధానమంత్రిత్వ కార్యాలయంలో ఉంది. మోదీ అనుమతి తెలపగానే ప్రకాశం జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుకు అంకురార్పణ జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఏర్పాటు కానున్న ఈ నిమ్జ్ ద్వారా ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. అంతేకాక 45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

  • Loading...

More Telugu News