: తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష... తెలుగు భాషా పరిరక్షణ కోసమేనట
తమిళనాడులో తమిళ భాషా చట్టం పేరిట ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు, ఉర్దూ, కన్నడ, మలయాళం భాషల ఉనికిపై ముప్పేట దాడి చేస్తోంది. తమిళనాడులో చిక్కి శల్యమవుతున్న తెలుగు భాషను పరిరక్షించాలని చెన్నైకి చెందిన తెలుగు యువశక్తి నేత ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలను కలిశారు. ఈ క్రమంలో తమిళనాట తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే దీనిపై ఓసారి స్పందించిన ఆయన తమిళనాట తెలుగు పరిరక్షణ కోసం ఆ రాష్ట్ర సీఎం జయలలితతో మాట్లాడతానని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మరింత మేర దృష్టి సారించిన పవన్ కల్యాణ్ ఈ నెలాఖరున తమిళనాడులో ఏకంగా దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కల్యాణ్ అభిమానులు, తమిళనాడులోని తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.