: శ్రీవారి గరుడ సేవలో తప్పిన పెనుముప్పు...గజరాజు దాడిలో మావటికి స్వల్ప గాయాలు
తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి జరిగిన వెంకన్న గరుడ సేవలో పెను ప్రమాదం తప్పింది. తిరుమలేశుడి గరుడ సేవ కోసం తీసుకొచ్చిన ఓ గజరాజు... మావటి సుబ్రహ్మణ్యంపై ఉన్నపళంగా దాడి చేసింది. ఈ దాడిలో అతనికి స్పల్ప గాయాలయ్యాయి. వెనువెంటనే అతడిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. గరుడ సేవ ముగిసిన అనంతరం భక్తుల కేరింతలతో ఒక్కసారిగా అదుపు తప్పిన గజరాజు పక్కనే ఉన్న మావటిపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ దాడి నుంచి సుబ్రహ్మణ్యం ఒడుపుగా తప్పించుకోవడంతో పాటు గజరాజును కూడా అదుపు చేయగలిగాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.