: ప్రియుడితో కలసి సొంతింటికే కన్నం!


ప్రేమించిన ప్రియుడికి ఒక్కో బంగారు నగా ఇచ్చేసి, ఆపై భర్తకు తెలుస్తుందన్న భయంతో సొంత ఇంట్లోనే దొంగతనానికి పురికొల్పిన యువతిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన గుడివాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక రాజేంద్రనగర్ లో నివాసముండే నాగజ్యోతికి ముడిలి వేణుబాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వేణుకు డబ్బు అవసరమైనప్పుడల్లా నాగజ్యోతి తన నగలను ఇస్తుండగా, అతడు దాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెడుతూ వచ్చాడు. వినాయకచవితి వస్తున్న సందర్భంగా తన భర్త నగల గురించి అడుగుతాడని, వాటిని విడిపించి ఇవ్వాలని జ్యోతి కోరగా, తన వద్ద డబ్బులేదని వేణు స్పష్టం చేశాడు. దీంతో ఇద్దరూ కలసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా వేణు, అతని బావమరిది శ్రీధర్ కలసి దీపావళి పిస్టల్, కత్తులతో ఆమె ఇంట్లోకి ప్రవేశించి, భర్తను బెదిరించి డబ్బు దోచుకుని నగలు తీసుకెళ్లినట్టు నటించారు. మరుసటి రోజు భర్తతో కలసి ఏమీ తెలియనట్టు నటిస్తూ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తనను పట్టుకుంటారన్న భయంతో వేణుబాబు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను కోలుకున్న తరువాత పోలీసులు విచారిస్తే, అసలు విషయం బయటపడింది. వేణుతో పాటు నాగజ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News