: ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చైనాలో నేతాజీ!
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికేవున్నారా? చైనాలో ఆశ్రయం పొందారా? 1949 ప్రాంతంలో అక్కడ కౌమింటాంగ్ దళాలకు వ్యతిరేకంగా మావోలు జరిపిన పోరాటానికి తన వంతు సహకారం అందించారా? ఈ ప్రశ్నలకు అవునన్న సంచలన సమాధానాలు బహిర్గతమయ్యాయి. జనవరి 26, 1949 తేదీతో ఉన్న ఓ ఫైల్ లో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయట. సుభాష్ సోదరుడు శరత్ బోస్ యూరప్ నుంచి వచ్చిన తరువాత 1949లో ఫార్వార్డ్ బ్లాక్, సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఫార్వార్డ్ బ్లాక్ పేరిట తాను తయారు చేసిన సైన్యానికి తదుపరి సోషలిస్టు రిపబ్లికన్ పార్టీగా (ఎస్ఆర్పీ) బోస్ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎస్ఆర్పీ కీలక నేతలైన లీలా రాయ్, జ్యోతిష్ జోర్దార్, అనిల్ రాయ్, సత్యా బక్షీ, శరత్ తదితరులు యూరప్ నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని విశ్లేషించిన మీదట చైనీస్ లిబరేషన్ పోరాటానికి ఆయన మద్దతిస్తున్నారు. ఆయన చైనాలో బతికేవున్నట్టు నమ్మారని ఈ పత్రాల్లో ఉంది. ఆ సమయంలో చైనాలో పౌర యుద్ధం భీకరంగా జరిగింది. కౌమింటాంగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి, మావోల నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా దళాలకు పోరు సాగుతుండేది. ఈ యుద్ధంలో మావోల విజయం వెనుక నేతాజీ అపార మేధస్సు, ఆయన యుద్ధ చతురత ఉన్నాయని శరత్ బోస్ వ్యాఖ్యానించినట్టు ఈ ఫైల్ లో ఉంది. నేతాజీ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడి, విడిపోయి కార్యకలాపాలు సాగిస్తున్న వామపక్ష పార్టీలను ఏకతాటిపై నిలపాలని ఆయన భావించినట్టు కూడా తెలుస్తోంది. అప్పట్లో శరత్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వాదించిన కొందరు, ప్రపంచ పరిణామాలను గమనించి నేతాజీ బతికే వుండవచ్చని భావించారని తెలుస్తోంది.