: సంచలనం... రాజస్థాన్ గనుల కుంభకోణం వెలుగులోకి రావడం వెనుక మోదీ కార్యాలయం కోవర్ట్ ఆపరేషన్!
రాజస్థాన్... బీజేపీ పాలిత ప్రాంతం. ఆ పార్టీకి కంచుకోట కూడా. ఎన్ని ఆరోపణలు వచ్చినా వసుంధరా రాజేను పక్కన పెట్టే ధైర్యం చేయలేకపోయారు. ఆమెను తప్పించాలన్న ఉద్దేశంతో, బీజేపీ అధినాయకులు స్వయంగా కల్పించుకుని ఆ రాష్ట్రంలో జరుగుతున్న గనుల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారని సంచలన కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. నరేంద్ర మోదీ కార్యాలయం ఓ కోవర్ట్ ఆపరేషన్ చేసి కుంభకోణాన్ని బహిర్గతం చేసినట్టు సమాచారం. ఈ కుంభకోణంలో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సహా హోం మంత్రి గులాబ్ చంద్ కటారియాల ప్రమేయం ఉన్నట్టు వెల్లడైంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు 1983 ఐఏఎస్ బ్యాచ్ అధికారి, రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి అశోక్ సింఘ్వీతో పాటు మరో ఏడుగురిని బుధవారం నాడు అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి రూ. 4 కోట్లను రికవరీ చేశారు కూడా. మరుగున పడిపోవాల్సిన ఈ కేసు ప్రధాని కార్యాలయం సూచనల మేరకు వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. "నాకు ఈ కోవర్ట్ ఆపరేషన్ గురించి తెలియదు. ఉదయ్ పూర్ లో అరెస్టులు ప్రారంభమైన తరువాతే ఏం జరుగుతుందో నేను ఊహించాను" అని కటారియా వ్యాఖ్యానించారు. రాజేకు సైతం ఏసీబీ అధికారులు అరెస్టులు ప్రారంభించేంత వరకూ ఏం జరుగుతుందోనన్న సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. తాము రైడింగులు జరిపిన తరువాతనే ఆ వివరాలు సీఎంకు తెలిపామని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఏసీబీ అధికారి ఒకరు తెలియజేశారు. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ సంచలన కథనాన్ని ప్రచురించగా, రాజస్థాన్ తో పాటు దేశవ్యాప్తంగా మరో చర్చ మొదలైంది. వసుంధరా రాజేను తప్పించాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం, అందుకు ఈ గనుల కుంభకోణాన్ని వాడుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.