: బ్రహ్మోత్సవాలు... అయినా భక్తులు లేరు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో దేవదేవుని దర్శించుకునేందుకు తిరుమల గిరులకు లక్షలాదిగా భక్తులు తరలిరావడం ప్రతియేటా కనిపించేదే. దీనికితోడు తమిళ భక్తులకు అత్యంత ప్రధానమైన పెరటాసి మాసం మొదలైంది. పైగా వారాంతం... దీంతో శుక్ర, శనివారాల్లో రద్దీ విపరీతంగా ఉంటుందని లెక్కలు కట్టిన టీటీడీ అధికారులు అవాక్కయ్యారు. నిన్న రద్దీ తక్కువగా కనిపించగా, ఈ ఉదయం సైతం అదే పరిస్థితి నెలకొంది. దివ్యదర్శనం భక్తులకు రెండు గంటల్లోపే దర్శనం లభిస్తోందంటే, భక్తుల సంఖ్య ఎంత పలుచగా ఉందో ఊహించవచ్చు. రద్దీ తగ్గడంతో అదనపు లడ్డూ కోటాను 40 వేలకు పెంచారు. దీంతో కొనుక్కున్న వారికి కొనుక్కున్నన్ని లడ్డూలు లభించాయి. వసతి గదులు సైతం సులువుగా దొరికాయి. రద్దీ తక్కువగా ఉందని, స్వామివారిని సులువుగా దర్శించుకునేందుకు భక్తులు రావాలని టీటీడీ అధికారులు పదేపదే మైకుల ద్వారా ప్రచారం చేయడం కనిపించింది. రేపు గరుడోత్సవం ఉన్న నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. సామాన్యులకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.