: శ్రీవారి ఆస్తిపాస్తుల లెక్కలివే!
తిరుమల కొండలపై కొలువైన శ్రీవెంకటేశ్వరుని ఆస్తి విలువ ఎంత? ఏటికేడు సిరి సంపదలు పెంచుకుంటూ వెళ్లే ఆయన వద్ద ఎంత భూమి ఉంది? ఎంత బంగారం ఉంది? ఎంత రొక్కం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలా?... హైకోర్టు ఆదేశాలతో, టీటీడీ శ్రీవారి ఆస్తుల వివరాలను గణించడం 2009లో ప్రారంభించింది. ఈ గణాంకాల ప్రకారం 4,143 ఎకరాల్లో వెంకన్న పేరిట భూములు, భవనాలు ఉన్నాయి. వీటి కనీస ధర (ప్రభుత్వ లెక్కల ప్రకారం) రూ. 33,447.74 కోట్లు కాగా, మార్కెట్ ధర రూ. 2 లక్షల కోట్లకు పైమాటే. ఇక ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఆయన పేరిట రూ. 10 వేల కోట్లకు పైగానే ఉంది. దీనిపై సంవత్సరానికి రూ. 744 కోట్లు వడ్డీ రూపంలో వస్తుంది. మరో రెండేళ్లలో ఈ వడ్డీ రూ. 1000 కోట్లను దాటనుందని అంచనా. ఇక శ్రీవెంగమాంబ నిత్యాన్న ప్రసాద ట్రస్టులో విరాళాల మొత్తం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ. 591 కోట్లకు పెరిగింది. దీంతో పాటు ప్రాణదాన ట్రస్టు కింద రూ. 200 కోట్లు, మిగిలిన ట్రస్టుల్లో రూ. 300 కోట్లు ఉన్నాయి. రోజువారీ భక్తుల నుంచి వచ్చే విరాళాలు సాలీనా రూ. 100 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇక బంగారం నిల్వలకైతే లెక్కేలేదు. నేటితరం నిపుణులు లెక్కకట్టలేని విలువైన ఆభరణాలెన్నో ఆయనకు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల నుంచి ఎందరో ప్రభువులు ఇచ్చిన బంగారు, వజ్రాభరణాలు బొక్కసంలో ఉన్నాయి. భక్తులిచ్చిన కానుకలను గోల్డ్ డిపాజిట్ల రూపంలో టీటీడీ బ్యాంకుల్లో దాస్తోంది. 1933లో లక్షల్లో ఉన్న తిరుమల బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,530 కోట్లకు చేరింది. ఇక ఏటేటా ఆయన్ను దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోందని వేరే చెప్పాలా?