: వ్యాపమ్ 'హీరో' దెబ్బకు దిగొచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్!
వ్యాపమ్... మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన ఓ పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణాన్ని తొలుత బయటపెట్టిన వ్యక్తి ఆనంద్ రాయ్. ఆనంద్ రాయ్, ఆయన సతీమణి గౌరి దంపతులు ఇండోర్ లో ప్రభుత్వ డాక్టర్లు. వీరు బయటపెట్టిన కుంభకోణం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆపై ఎన్నో హత్యలు, అనుమానాస్పద మరణాలు జరిగాయి. ఇదంతా ఒకవైపు. అయితే, ఈనెల 11న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆయన అధికారిక నివాసంలో రాత్రి 9:45 నుంచి గంటకు పైగా ఆనంద్ రాయ్ రహస్యంగా కలిశారట. ఆపై నిన్న ఆనంద్ దంపతులను బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆనంద్ రాయ్ మీడియా ముందుకు వచ్చాడు. తాను సీఎంతో మాట్లాడానని, దాన్నంతా తన వద్ద ఉన్న సీక్రెట్ కెమెరాతో రికార్డు చేశానని తెలిపారు. చౌహాన్ తో తన భేటీని వారు రికార్డు చేసి తమకు కావాల్సిన భాగాలనే విడుదల చేసే అవకాశం ఉండటంతో తాను ఈ పని చేశానని, తనకు వారిని బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం లేదని చెప్పారు. ఆనంద్ మీడియా సమావేశం ముగిసిన గంటల వ్యవధిలో వీరి బదిలీలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు, బీజేపీ నేతలపై తాను సీఎంకు ఫిర్యాదు చేశానని, అందువల్లే బదిలీ వేటు వేశారని తెలిపారు. స్కాంలో తన పేరును, తన కుటుంబ సభ్యుల పేర్లను వెల్లడించరాదని చౌహాన్ కోరినట్టు తెలిపారు. "ఇక మీ వద్ద ఉన్న సంభాషణలు విడుదల చేస్తారా?" అని అడుగగా, అది నైతికత కాదని తప్పించుకున్నారు.