: నగరంలో పెరుగుతున్న గన్ కల్చర్... భూ వివాదంలో కాల్పులకు తెగబడ్డ కాంగ్రెస్ నేత


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గన్ కల్చర్ పెరుగుతోంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిపై ఓ కానిస్టేబుల్ కాల్పుల ఘటన నుంచి నిన్న జీడిమెట్లలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన వరకు పరిశీలిస్తే, సామాన్యులకు కూడా నగరంలో తుపాకులు సులువుగా లభిస్తున్నాయి. నిన్న రాత్రి పాతబస్తీ పరిధిలో ఓ కాంగ్రెస్ నేత ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఏకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భీతిల్లిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకెళితే.... టోలిచౌకికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత జాబేర్ పటేల్ ఆ పార్టీ జాతీయ మైనారిటీ సెల్ కన్వీనర్ గా పనిచేస్తున్నానంటూ ఎర్రబుగ్గ కారులో హల్ చల్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం గోల్కొండ పరిధిలోని ఓ ఫ్లాట్ విషయంలో ఆయన స్థానికులతో వాగ్వాదానికి దిగారు. తీరా తమ దాకా వచ్చిన పంచాయతీని పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. కూర్చుని మాట్లాడుకోండి అంటూ ఉచిత సలహా పడేసి పంపించివేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి గోల్కొండకు చెందిన ఫరీద్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగిందట. దీంతో ఆగ్రహావేశంతో ఊగిపోయిన జాబేర్ పటేల్ తన పిస్టల్ తీసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారట. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News