: కోర్టు తీర్పు కాపీతో ప్రకాశం జడ్పీకి ఈదర... తాళం వేసుకుని వెళ్లిపోయిన సీఈఓ


ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కొద్దిసేపటి క్రితం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రల కారణంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కోల్పోయిన ఆ జిల్లా సీనియర్ రాజకీయ నేత ఈదర హరిబాబు పట్టువదలని విక్రమార్కుడిలా పోరు సాగించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఆయన ఏకంగా సుప్రీంకోర్టు గడప కూడా తొక్కారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పునివ్వడంతో కోర్టు తీర్పు కాపీలను చేతబట్టుకుని ఆయన కొద్దిసేపటి క్రితం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే, హరిబాబు వస్తున్నారని తెలుసుకున్న జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జడ్పీ చైర్మన్ చాంబర్ కు తాళం వేసుకుని వెళ్లారు. గతంలోనూ ఈదరను అడ్డుకునేందుకు అధికారులు చైర్మన్ చాంబర్ కు తాళాలేసిన సంగతి తెలిసిందే. తీర్పు కాపీతో జడ్పీకి వచ్చిన ఈదర, అధికారుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News