: పుట్టుకతోనే రూ. 20 వేల అప్పుభారం మోస్తున్న తెలంగాణ బిడ్డలు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
తెలంగాణలో పుడుతున్న ప్రతి బిడ్డపై, పుట్టుకతోనే రూ. 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యానించింది. ఇండియాలో గుజరాత్ తరువాత ఆదాయం మిగులు రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకున్న కేసీఆర్ రూ. 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. ఈ రుణాలను అధిక వడ్డీలకు తీసుకోవడంతో బడ్జెట్ లో వడ్డీల భారం అధికం కానుందని, దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అప్పులపై తాము సమాచార హక్కు చట్టం వినియోగించి సమాచారం పొందామని తెలిపిన ఆయన, పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం 9 శాతం వడ్డీతో బాండ్లను విక్రయించి రూ. 23 వేల కోట్లు, 11 శాతం వడ్డీకి రూ. 24 వేల కోట్లు రుణాల రూపంలో తెచ్చుకుందని, వీటి ప్రభావం ఇప్పటికే ప్రజలపై పడిందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 'పెట్రో' ఉత్పత్తులపై అధిక పన్నులు వేశారని ఆయన గుర్తించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకుంటే, వడ్డీల భారం మోయక తప్పదని అన్నారు.