: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని ఆయన ప్రకటించారు. నేటి ఉదయం ఓ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉమ ఈ మేరకు ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ భేటీనే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ఉన్న అడ్డంకులపై నిన్నటి నీతి ఆయోగ్ సమావేశం చర్చించిందని కూడా ఆయన చెప్పారు.