: ఫెదరర్ మహానుభావుడు: హర్భజన్ సింగ్


రోజర్ ఫెదరర్ మహానుభావుడని టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొనియాడుతున్నాడు. అలా అనడానికి కారణాలు కూడా భజ్జీ వివరించాడు. "రోజర్ ఫెదరర్ అభిమాని ఒకామె కేన్సర్ తో బాధపడుతోంది. ఫెదరర్ ను కలవాలనే ఆమె ఆఖరు కోరిక గురించి వింబుల్డన్ టోర్నీ ఆడుతున్నప్పుడు అతనికి 'మేక్ ఎ విష్' ఫౌండేషన్ వివరించింది. దీంతో ఆమెను లండన్ ఆహ్వానించారు ఫెదరర్, టోర్నీ మధ్యలోనే ఆమెను కలిశారు. కేవలం కరచాలనంతో సరిపెట్టకుండా ఆమెకు టెన్నిస్ కిట్ బహూకరించారు. అనంతరం ఆమెతో సరదాగా కాసేపు టెన్నిస్ ఆడారు. కేవలం టెన్నిస్ క్రీడాకారులకు మాత్రమే ప్రవేశం ఉండే లాన్ లోకి ఆమెను తీసుకెళ్లి సెరేనా, ఆండీ ముర్రే, రఫేల్ నాదల్, ఇతర క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆమెను ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పి, వీడ్కోలు పలికారు. ఆమె వెళ్తున్న సమయంలో ఆమె కష్టాన్ని తలచుకుని కన్నీరుపెట్టుకున్నారు. అందుకే, ఆ గొప్ప వ్యక్తికి సలాం చేస్తున్నాను" అంటూ భజ్జీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆమెను ఫెదరర్ ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News