: ఆ ఎస్సై కేసు సీఐడీకి అప్పగించాం: నాయిని
రంగారెడ్డి జిల్లా యాలల ఎస్సై రమేష్ అనుమానాస్పద మృతి కేసును సీబీసీఐడీకి అప్పగిస్తున్నట్టు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సై రమేష్ మృతిపై వారి కుటుంబ సభ్యులకు పలు అనుమానాలున్నాయని, అందుకే సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించామని అన్నారు. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తరువాత వాస్తవాలు బయటపడతాయని అభిప్రాయపడ్డ ఆయన, కేసును సీబీసీఐడీ చూసుకుంటుందని తెలిపారు. కాగా, స్ట్రిక్ట్ గా విధులు నిర్వర్తిస్తాడన్న పేరుతెచ్చుకున్న ఎస్సై రమేష్, రెండు రోజుల క్రితం భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి, 'సీఐ పిలుస్తున్నారు. వెళ్లివస్తా'నని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. తర్వాత 'చింతచెట్టు, కందినెల్లి' అంటూ ఒక మెసేజ్, తర్వాత 'సారీ' అంటూ రెండో ఎస్ఎమ్ఎస్ పంపారు. అనుమానం వచ్చిన భార్య స్టేషన్ కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో కాసేపటికే ఆయన ఉరివేసుకున్నారని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు సీఐపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.