: టికెట్ లేకుండా రైలెక్కి... టీసీ రావడంతో దూకేసిన యువకుడు
టికెట్ లేని రైలు ప్రయాణం ఆ యువకుడిని ఆసుపత్రి బెడ్ ఎక్కించింది. టికెట్ కొనకుండానే రైలెక్కిన ఆ యువకుడు టికెట్ కలెక్టర్ చెకింగుకి వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే, రమేశ్ అనే యువకుడు టికెట్ కొనకుండానే కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కేశాడు. ఎక్స్ ప్రెస్ రైళ్లలో టీసీల బెడద అంతగా ఉండదన్న భావనే అతడిని టికెట్ లేని ప్రయాణానికి పురికొల్పింది. అయితే అతడి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ వైపు నుంచి టీసీ రైల్లో ఉన్నవారందరి వద్ద టికెట్లు చెక్ చేస్తూ వస్తున్నారు. ఇంకొద్దిసేపుంటే రమేశ్ వద్దకూ టీసీ వచ్చేస్తారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనకు గురైన రమేశ్ రైలు ఎంత వేగంతో వెళుతోందన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఉన్నపళంగా బయటకు దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.